బీజేపీకి బిగ్ షాక్..! కారెక్కనున్న దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి?
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఎత్తులు పైఎత్తులు సాగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయం మరింత రంజుగా మారింది. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ను బీజేపీ లాగేసుకుంది. గౌడ్ కమ్యూనిటీకి చెందిన బూర నరసయ్య గౌడ్ ను కోల్పోవడం టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. దీంతో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా పలువురు బీజేపీ నేతలకు గాలం వేస్తోంది. తాజాగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ ను మళ్లీ తమ గూటికి తెచ్చుకుంటోంది టీఆర్ఎస్. బీజేపీకి గుడ్ బై చెప్తున్నట్టు దాసోజు శ్రవణ్ ప్రకటించారు.
మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఇటీవలే బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. అయితే అక్కడ ఇమడలేక వెంటనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి మళ్లీ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దాసోజు శ్రవణ్ కీలక పాత్ర పోషించారు. నాడు కేసీఆర్ తర్వాత మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో ఏఐసీసీ ప్రతినిధిగా పని చేసిన శ్రవణ్ .. ఇటీవల రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీని వదిలేశారు. అయితే బీజేపీలో చేరిన కొన్ని రోజులకే దాన్ని వదిలేసి టీఆర్ఎస్ లో చేరడం సంచలనం కలిగిస్తోంది.
దాసోజు శ్రవణ్ మాత్రమే కాదు.. మరో ఇద్దరు బీజేపీ నేతలు కూడా కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన జితేందర్ రెడ్డి, స్వామిగౌడ్ త్వరలోనే మళ్లీ టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే సమాచారం అందుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వామిగౌడ్ శాసనమండలి ఛైర్మన్ గా పనిచేశారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇవ్వలేదనే బాధతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే తనకు అక్కడ పెద్దగా ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదనతో ఉన్నారు. అందుకో పార్టీ మారేందుకు నిర్ణయించుకునన్నారమే సమాచారం అందుతోంది.
మరోవైపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కారెక్కబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014లో టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన జితేందర్ రెడ్డి ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. అయితే 2019లో ఆయనకు టికెట్ నిరాకరించారు కేసీఆర్. దీంతో ఆయన బీజేపీ గూటికి చేరిపోయారు. బీజేపీలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. దుబ్బాక, హుజూర్ నగర్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. అయితే ఇప్పుడు మునుగోడులో తనను పక్కన పెట్టారనే ఆవేదన జితేందర్ రెడ్డిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన మళ్లీ సొంతగూటికి వెళ్లడమే మేలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.













