బండి సంజయ్ ని తప్పించి బీజేపీ పెద్ద తప్పే చేసిందా..?
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడడంతో అన్ని పార్టీలూ ఆ మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కేసీఆర్ ను గద్దె దించుతామని మొదటి నుంచి బీజేపీ చెప్తూ వచ్చింది. రాష్ట్ర నాయకులు కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ఎంతోకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేసీఆరు కుటుంబ పాలన అంతం కావాలంటే కచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలని.. ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో తెలంగాణ నేతలు కూడా పలువురు ఆ పార్టీలోకి వెళ్లారు. అన్నిటికీ మించి బండి సంజయ్ దూకుడు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో దోహదపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట బండి సంజయ్ ని అనూహ్యంగా తప్పించడం సంచలనానికి కారణమైంది.
బండి సంజయ్ మాస్ లీడర్. గల్లీ నుంచి ఎదిగిన నేత. ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు. అందుకూ అనతికాలంలోనే ఆయనకు మంచి అవకాశాలొచ్చాయి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. చివరకు రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. బీజేపీలో పని చేసే కార్యకర్తలకు కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని.. వాళ్ల బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదని బండి సంజయ్ నిరూపించారు. వారసత్వ రాయకీయాలకు బీజేపీ దూరంగా ఉంటుంది. అందుకే అక్కడ కుటుంబ నేతల కంటే క్రమశిక్షణ కలిగిన నేతలే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారిలో బండి సంజయ్ ముందుంటారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతలను బండి సంజయ్ కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. శక్తివంచన లేకుండా పని చేశారు. కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు.
బండి సంజయ్ నేతృత్వంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకుంది బీజేపీ. అలాగే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలను కైవసం చేసుకుంది. మునుగోడులో ఓడిపోయినా పార్టీ మాత్రం బలపడింది. బండి సంజయ్ దూకుడు పార్టీని బీఆర్ఎస్ తో ఢీకొట్టే స్థాయికి తీసుకెళ్లింది. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. అయితే బండి సంజయ్ ని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి పగ్గాలిచ్చింది అధిష్టానం. బండి సంజయ్ పనితీరు మెచ్చి కేంద్ర మంత్రిని చేయాలనే సదుద్దేశంతో అధిష్టానం ఈ పని చేసి ఉండొచ్చు. కానీ బండి సంజయ్ రాష్ట్రంలో ఉంటే పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేవారు. పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురాగలిగేవారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని పక్కనపెట్టి చూసినప్పుడు బండి సంజయ్ వైపే ఎక్కువ మంది కార్యకర్తలు మొగ్గు చూపుతారు.
కిషన్ రెడ్డి సౌమ్యుడు. దూకుడు రాజకీయాలు తనకు తెలియవు. నొప్పంపిక తానొవ్వక అనేది కిషన్ రెడ్డి పాలసీ. కానీ బండి సంజయ్ అలా కాదు. ఎవరు ఏమైపోయినా పర్లేదు.. పార్టీ బలపడితే చాలనుకుంటారు. అందుకే బండి సంజయ్ స్టేజ్ ఎక్కితే చాలు.. చప్పట్లు మార్మోగుతాయి. ఇవాళ మోదీ బహిరంగ సభలో కూడా ఆయన పోడియం దగ్గరకు రాగానే అభిమానులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఆయన్ను జనం కోరుకుంటున్నారు. ఎన్నికల ముందు బండి సంజయ్ ని మార్చకుండా ఉంటే బాగుండేదనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పదవులతో పనిలేదని బీజేపీ భావిస్తుంది. రేపు బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి వచ్చినా ఆయన రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి పెట్టి పని చేయొచ్చు. అలా వాడుకుంటే పార్టీకి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి.













