టీకాంగ్రెస్‌లో కొత్త చిచ్చు రేపుతున్న అజారుద్దీన్..!!
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉంటుందని అందరికీ తెలుసు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అయితే ఇది మరింత ఎక్కువ. ఇక్కడ అందరూ అధినేతలే. ఎవ్వరూ ఎవ్వరిమాటా వినరు. ఎవరి దారి వారిదే. ఎవరికి వాళ్లే అధినేతలుగా చెప్పుకుని చెలామణీ అవుతుంటారు. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. పార్టీలో ఎవరిపైనైనా బురద జల్లేస్తుంటారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుంటారు. ఒకరంటే మరొకరికి పడదు. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలా.. అని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అజారుద్దీన్ ఆ పార్టీకి మరో సమస్య తెచ్చి పెడుతున్నారు.
అజారుద్దీన్ క్రికెటర్ గానే కాదు.. మాజీ పార్లమెంటు సభ్యుడిగా సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఆయనకున్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన పుట్టి పెరిగింది హైదరాబదే అయినా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ తెలంగాణ నుంచి గెలవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన కన్ను ఇప్పుడు పార్లమెంటు సీటుపైన కాకుండా అసెంబ్లీ పైన పడిందని తెలుస్తోంది. ఈసారి హైదరాబాద్ లోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
అజారుద్దీన్ ఎప్పుడూ ప్రజల్లోకి వచ్చిన మనిషి కాదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో గెలవాలంటే కచ్చితంగా ప్రజల్లో ఉండాలి. అందుకే ఆయన జూబ్లీహిల్స్ ను ఎంచుకున్నారు. ఈసారి అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో బాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అజారుద్దీన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. అయితే అజారుద్దీన్ పర్యటనలను స్థానిక నేత పి,విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. పీజేఆర్ కుమారుడు పీవీఆర్ ఈసారి కూడా తనకే జూబ్లీహిల్స్ టికెట్ దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా అజారుద్దీన్ రేసులోకి రావడం వాళ్లను ఆశ్చర్యపరుస్తోంది.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఇప్పుడు అజారుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే జూబ్లీహిల్స్ లో పర్యటిస్తున్నట్టు అజారుద్దీన్ చెప్తున్నారు. అయితే తన పరిస్థితి ఏంటని పీవీఆర్ ప్రశ్నిస్తున్నారు. పీవీఆర్ కు టికెట్ దక్కడం ఇష్టంలోని ఓ వర్గం కావాలనే అజారుద్దీన్ ను ఎగదోస్తోందని సొంతపార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ అధిష్టానంతో సఖ్యతగా ఉంటారు. కాబట్టి అజారుద్దీన్ కే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విష్ణువర్ధన్ రెడ్డిని ఏం చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి అజారుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమస్య తెచ్చిపెట్టారు.













