తెలంగాణపై అమిత్ షా ఫోకస్.. 23న ఏం జరగబోతోంది?
కర్నాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీజేపీ అగ్రనేతలంతా అక్కడే మకాం వేసి పర్యటిస్తుంటారు. కానీ కర్నాటకలో మాత్రం అలా జరగట్లేదు. పైగా అమిత్ షా పక్కనున్న తెలంగాణపై దృష్టి పెట్టారు. ఈ నెల 23న ఆయన తెలంగాణలో పర్యటించబోతున్నారు. అమిత్ షా పర్యటనలో పలువురు కీలక నేతలు చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాస్త కష్టపడితే తాము అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాబోదనేది ఆ పార్టీ నేతల అంచనా. తమకు సానుకూల పరిణామాలు ఉన్నాయని, అందుకే తెగించి కొట్లాడితే పోయేదేమీ లేదని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఇకపై ప్రతి నెలా ఒకరిద్దరు తెలంగాణలో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు.
23వ తేదీన అమిత్ షా లోక్ సభ ప్రవాసీ యోజన సమావేశంలో పాల్గొంటున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి అక్కడి పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుని 300 స్థానాలకు పైగా గెలిచి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచన. అందుకోసం దశలవారీగా లోక్ సభ ప్రవాసీ యోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో మూడో విడత జరగబోతోంది. చేవెళ్లలో ఆదివారం జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటున్నారు.
అమిత్ షా పర్యటనలో పలువురు కీలక నేతలు చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరతారని తెలుస్తోంది. అయితే వాళ్లిద్దరు నేతల చేరికపై ఇంకా అధికారికంగా సమాచారం లేదు. మరోవైపు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా కమలం కండువా కప్పుకుంటారని చెప్తున్నారు. అయితే తన చేరికపై వస్తున్న వార్తలు అవాస్తవమని మహేందర్ రెడ్డి కొట్టిపారేశారు. దీంతో కమలం కండువా కప్పుకునే ఆ కీలక నేతలెవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఎన్నికల వరకూ అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా రాష్ట్ర కేడర్ కు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.













