రేపటి అమిత్ షా పర్యటన రద్దు.. షాక్ లో తెలంగాణ బీజేపీ ..!!
తెలంగాణ బీజేపీ శ్రేణులు అమిత్ షా పర్యటనకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఆయన పర్యటన అర్ధంతరంగా రద్దయింది. రేపు హైదరాబాద్, ఖమ్మంలో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ సెట్ అవుతుందని, పూర్తిస్థాయిలో ఎన్నికలకు సమాయత్తమవుతుందని భావించారు. అయితే అమిత్ షా పర్యటన ఏకంగా రద్దు కావడంతో బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి. హైదరాబాద్ కు రాకపోయినా నేరుగా ఖమ్మం వచ్చి బహిరంగసభలో పాల్గొనాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. అయితే దానికి కూడా వీలు లేదని కేంద్రం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది.
పశ్చిమ తీరాన్ని బిపర్జాయ్ తుపాను వణికిస్తోంది. రేపు ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా గుజరాత్ పైన ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. అతి తీవ్ర తుపాను కావడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే అధికార యంత్రాంగం అంతా అక్కడే దృష్టి కేంద్రీకరించింది. ఈ తుపానుపై ప్రధాని మోదీ ఇప్పటికే రెండు సార్లు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అయితే తుపాను ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ.. అమిత్ షాను ఆదేశించినట్టు సమాచారం. పైగా అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో అక్కడ తన సేవలు అవసరమని అమిత్ షా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.
తుపాను ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉన్నందువల్ల తెలంగామ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా కార్యాలయం తెలంగాణ బీజేపీకి సమాచారం అందించింది. దీంతో ఖమ్మంలో సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేశాయి. అయితే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయినందును నేరుగా ఖమ్మం వచ్చి సభలో పాల్గొనాలని అమిత్ షాను బీజేపీ శ్రేణులు కోరాయి. అయితే అది వీలు కాకపోవచ్చని కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో తెలంగాణ శ్రేణులు డీలా పడిపోయాయి. వాస్తవానికి అమిత్ షా ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. రేపు ఉదయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాజమౌళితో బేటీ కావాల్సి ఉంది. అనంతరం భద్రాచలం వెళ్లి రాములోరి దర్శనం అనంతరం ఖమ్మం వెళ్లి బహిరంగసభలో పాల్గొనేలా షెడ్యూల్ రెడీ చేశారు. సభ తర్వాత విజయవాడ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేలా ప్రోగ్రామ్ ఖరారు చేశారు.
అయితే అమిత్ షా రాకపోవడంతో కమలం పార్టీ నేతలు పూర్తి నిరుత్సాహంలో ఉన్నారు. అమిత్ షా వస్తే పార్టీకి దిశానిర్దేశం చేస్తారని భావించారు. ప్రస్తుతం పార్టీ కాస్త గందరగోళంలో ఉంది. నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకంటూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారీగా చేరికలు ఉంటాయనుకుంటే ఉన్న నేతలే పోయే పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ అమిత్ షా చెక్ పెడతారని భావించారు. అయితే వాళ్ల ఆశలన్నీ అడియాశలైపోయాయి.













