అమిత్ షా: కర్ణాటక ఎన్నికల తర్వాత ఫోకస్ ఏంటి…? తెలంగాణాపై ప్లాన్ రెడీనా…?
రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో బిజెపి అధిష్టానం ఏ విధమైన అడుగులు వేస్తుంది అనే దానిపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతున్న నేపధ్యంలో బిజెపి జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం ఒక లక్ష్యం అయితే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణా నుంచి కనీసం ఆరు నుంచి 8 స్థానాలు గెలిచి తీరాలని అమిత్ షా పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలో పార్టీ కార్యాచరణ మీద కూడా ఆయన దృష్టి సారించారు.
కర్ణాటక లో పార్టీ ఓటమి పాలయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో అమిత్ షా కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసారు. అక్కడి ఎన్నికల ప్రచారాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తున్న నేపధ్యంలో ఆయన జాగ్రత్తగానే ప్లాన్ రెడీ చేస్తున్నారని సమాచారం. కీలక నేతలను ఆపాలని ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కర్ణాటక లో జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి అమిత్ షా తెలంగాణా మీద గురి పెట్టారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కర్ణాటక ఎన్నికల తర్వాత అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా తెలంగాణా ఎన్నికలు కూడా వస్తున్నాయి. దీనితో ఎలా అయినా సరే తెలంగాణాలో పార్టీ ని బలోపేతం చేయాలని అధికారంలోకి రావాలని అమిత్ షా భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి ఫోకస్ తెలంగాణా మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీద ఉంటుందని సమాచారం. బిజెపి నేతలకు ఇప్పటికే సూచనలు కూడా ఇచ్చారని అంటున్నారు. కీలక నాయకులు… అధికార పార్టీ నుంచి వచ్చే విధంగా ప్లాన్ రెడీ చేయాలని రాష్ట్ర నేతలకు ఆయన సూచించారని సమాచారం.
బండి సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేయడం బిజెపికి పరోక్షంగా కలిసి వచ్చే అంశమే. ఇది కాంగ్రెస్ కి కూడా నష్టం చేస్తుంది. దీనితో ఈ పరిణామాలను వాడుకోవాలని అమిత్ షా భావిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ లో భారీ బహిరంగ సభలను నిర్వహించే ప్లాన్ కూడా అమిత్ షా చేస్తున్నారు. దీని మీద షెడ్యూల్ కూడా త్వరలోనే ఖరారు చేయనున్నారు అమిత్ షా.













