‘పెద్దల’ కోసం పోటాపోటీ..! ఎల్లుండే పోలింగ్..!!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగుస్తోంది. ఎల్లుండి ఆదివారం ఈ ఎన్నిక జరగనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో పాగా వేయాలని అటు టీఆర్ఎస్, ఇటు విపక్షాలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్నీ చేజార్చుకోకుండా వ్యూహప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ తరపున పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి బరిలో ఉన్నారు. బీజేపీ ఓటుబ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులను చీల్చడం, పీవీపై కాంగ్రెస్ నేతల్లో ఉన్న సానుభూతిని రాబట్టుకోవడం.. లాంటి అంశాలతో వ్యూహాత్మకంగా సురభి వాణీదేవిని ఎంపిక చేసింది టీఆర్ఎస్. వాణిదేవి కోసం కేటీఆర్, హరీశ్ రావు తదితర మంత్రులు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. తాము నమోదు చేయించిన ఓటర్లు ఓటేస్తే చాలు.. తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ భావిస్తోంది.
అటు బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ.. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా టీఆర్ఎస్ కు గట్టి సవాల్ విసరాలనుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. ఇతని గెలుపు బాధ్యతలను రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ జి.నాగేశ్వర్ ఈసారి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. తనకు అనేక సంఘాల మద్దతు ఉందని ఆయన చెప్తున్నారు.
ఇక ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున రాములు నాయక్, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక టీజేఎస్ తరపున కోదండరామ్, యువ తెలంగాణ పార్టీ తరపున రాణి రుద్రమ రెడ్డి, ఇంటి పార్టీ తరపున చెరుకు సుధాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
ఉద్యోగ నియామకాలపై అధికార టీఆర్ఎస్ ను విపక్షాలన్నీ టార్గెట్ చేశాయి. లక్షన్నర ఉద్యోగాలిచ్చామని టీఆర్ఎస్ చెప్తోందని.. అయితే అవన్నీ అసత్యాలేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇది అధికార పార్టీకి కాస్త ఇబ్బంది కలిగిస్తున్న అంశం. అయితే బీజేపీ టార్గెట్ గా ఈసారి టీఆర్ఎస్ దూకుడు పెంచింది. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగడతూ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూద్దాం.













