తెలంగాణకు కేజ్రీవాల్.. త్వరలోనే పాదయాత్ర?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. త్వరలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్‌కు రానున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్‌కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పాదయాత్ర చేపట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఆప్ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా సోమనాథ్ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.













