అసంతృప్తులను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్ బిజీ..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు కేసీఆర్. కేవలం నాలుగు స్థానాలు మాత్రమే పెండింగులో ఉన్నాయి. ఒకవైపు విపక్షాల కంటే ముందే ఎన్నికల బరిలో దూకి వాటికి చెక్ పెట్టామని బీఆర్ఎస్ సంబరపడుతోంది. అయితే .. అదే సమయంలో టికెట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది పార్టీ విజయావకాశాలను ఎక్కడ దెబ్బ తీస్తుందోననే టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోంది. అందుకే అసంతృప్తులను బుజ్జగించే పని పార్టీ నేతలకు అప్పగించారు అధినేత కేసీఆర్.
అసెంబ్లీ అభ్యర్థులను అనౌన్స్ చేసే ముందే అందరితో మాట్లాడానని కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ అనౌన్స్ చేయకముందు నుంచే కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాండూరుకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. దీంతో కేసీఆర్ ఆయన్ను ముందే దారిలోకి తెచ్చుకున్నారు. టికెట్స్ అనౌన్స్ చేసేటప్పుడు పక్కనే కూర్చోపెట్టుకున్నారు. ఆయనకు త్వరలోనే మంత్రిపదవి కట్టబెడతానని మాటిచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొందరు నేతలు మాత్రం ఇప్పటికీ అలక వీడలేదు.
ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పాలేరు నుంచి తనకు తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే ఆయన్ను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ మనోహర్ రెడ్డికే టికెట్ దక్కింది. దీంతో తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన్ను దారిలోకి తెచ్చుకునేందుకు జిల్లాకు చెందిన ఎంపీ నామా నాగేశ్వర రావును పంపించారు కేసీఆర్. సుమారు గంటసేపు తుమ్మల నాగేశ్వర రావుతో నామా చర్చలు జరిపారు. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని, తొందర పడొద్దని సూచించినట్టు సమాచారం. త్వరలోనే సీఎం కేసీఆర్ ను కలవాల్సిందిగా సూచించారు.
మరోవైపు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య తనకు టికెట్ దక్కకపోవడంతో భోరున విలపించారు. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ నవ్య వల్లే తనకు టికెట్ దక్కలేదని చెప్పారు. దీంతో రాజయ్యను దారికి తెచ్చే బాధ్యతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు కేసీఆర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి .. రాజయ్య నివాసానికి వెళ్లారు. అయితే రాజయ్య అందుబాటులోకి రాలేదు. అయితే రాజయ్యకు పార్టీ అన్యాయం చేయబోదని.. త్వరలోనే ఆయన సీఎం కేసీఆర్ ను కలుస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు కేసీఆర్. అందులో జనగామ ఒక్కటి. ఇక్కడ సీటుకోసం ముత్తిరెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో తనకు టికెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పట్టుబడుతున్నారు. తనకు సీటు ఇప్పించాల్సిందిగా ఆయన కవిత వెంట పడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఆయన రెండుసార్లు కవితను కలిసారు. ఇలా పలువురు నేతలను దారికి తెచ్చుకోవడం ఒకవైపు జరుగుతుండగానే.. మరోవైపు ఆశావహలు తమ ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నారు.













