సుష్మాస్వరాజ్ ఇకలేరు
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఇక లేరు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆమె హఠాన్మరణం చెందారు. 67 ఏళ్ల సుష్మాకు మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే పలువురు కేంద్ర మంత్రులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆమె మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు 2016లో మూత్రపిండ మార్పిడి జరిగింది. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ఆమెకు భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సురి ఉన్నారు. సుష్మా ఆకస్మిక మరణ వార్త బీజేపీ నేతలు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.













