భానుప్రియ కల నెరవేరింది
అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించాలన్న రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థిని కల ఎట్టకేలకు నెరవేరింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో దిగొచ్చిన అమెరికా రాయబార కార్యాలయం ఆ విద్యార్థినికి వీసా మంజూరు చేసింది. జలాల్‌పుర్‌కు చెందిన భానుప్రియ హరిత్వాల్ 10, 12 తరగతుల్లో విశేష ప్రతిభ కనబరిచి, ఉన్నతవిద్య కోసం రాజస్థాన్ ప్రభుత్వం అందించే కోటి రుపాయల ఉపకారవేతనానికి ఎంపికైంది. కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చేయాలని ఆశించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వీసా కోసం దరఖాస్తు చేయగా, దౌత్య కార్యాలయం 2 సార్లు తిరస్కరించింది. దీంతో ఆ కుటుంబ స్థానిక ఎంపీని ఆశ్రయించగా, ఆ విషయాన్ని మంత్రి సుష్మాస్వారాజ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి జోక్యంతో అమెరికా దౌత్య కార్యాలయం వీసాను మంజూరు చేసినట్లు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది.













