సుప్రీంకోర్టులో బీజేపీకి షాక్!
దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కర్నాటక రాజకీయ అంశంపై విచారణ జరిగింది. కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బల పరీక్షకు వారం రోజుల పాటు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. బల పరీక్షను రేపు సాయంత్రం 4 గంటలలోపు నిర్వహించాలని ఆదేశించింది. ఇక బల పరీక్షను రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని కోర్టును అటార్నీ జనరల్ రోహత్గీ కోరారు. దీనిని కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఎంఎల్ఎలు తమ చేతులు పైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎంఎల్ఎల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు ఇచ్చింది. అంతేగాక బలపరీక్ష పూర్తి అయ్యేవరకూ కీలక నిర్ణయాలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. బలపరీక్షకు ముందే ఎంఎల్ఎలతో ప్రమాణస్వీకారం చేయించాలని, 4 గంటలోపు ప్రొటెం స్పీకర్ను నియమించాలని సూచించింది. ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఎలను కూడా నామినేట్ చేయకూడదని న్యాయస్థానం సృష్టం చేసింది.
రేపే బలపరీక్ష : సుప్రీం
కర్ణాటకలో రాజకీయ నాటకానికి రేపటితో తెరపడనుంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొంది. శానససభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సృష్టం చేసింది.













