పెళ్లి ఖర్చులు చెప్పాల్సిందే
కట్నం కోసం ఇంటి ఇల్లాల్ని తన్ని పుట్టింటికి తరిమేసే ప్రబుద్ధులు కొందరు. కట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నారంటూ అత్తింటివారిపై అబద్ధపు కేసులు పెట్టే అతివలు కొందరు. ఈ రెండు సమస్యలకూ చెక్పెట్టాలంటే, పెళ్లి ఖర్చుల వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి సమర్పించేలా నిబంధన విధించాలనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపు కుటుంబాలు, పెళ్లికైన ఖర్చుల వివరాలను సంయుక్తంగా సమర్పిస్తే వరకట్న సంబంధిత సమస్యలు, తప్పుడు కేసులు తగ్గుతాయని కోర్టు అభిప్రాయపడింది. పెళ్లి ఖర్చుల్లో కొంత భాగాన్ని వధువు బ్యాంకు ఖాతాలో వేస్తే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తే ఆమెకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని, కాబట్టి ఈ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చట్టాలు, నిబంధనలను సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.













