నిషేధం లేదు కానీ షరతులు వర్తిస్తాయి
బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేమని, అయితే విక్రయాలపై కొన్ని షరతులు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. దీపావళి పండుగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. అయితే ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా బాణసంచా విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది. దీపావళి పండగ అంటేనే టపాసుల మోత. అయితే ఇలా పెద్దమొత్తంలో బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొద్ది రోజుల్లో దీపావళి పండగ రానున్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. బాణసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని సృష్టం చేసింది.













