ఇక నుంచి స్టార్ టీవీలో : IPL హక్కుల విలువ 16వేల కోట్లు
IPL మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఎంతగా ఇష్టపడుతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు నెలల పాటు ఫుల్ జోష్ గా జరిగే మ్యాచులను ప్రేక్షకులకు అందిచేందుకు ప్రముఖ టీవీ ఛానల్స్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 2018 IPL సీజన్ నుంచి.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మీడియా హక్కుల్ని స్టార్ ఇండియా దక్కించుకుంది. సోమవారం(సెప్టెంబర్-4) న జరిగిన వేలంలో రూ.16 వేల 347 కోట్ల రికార్డు ధరతో IPL ప్రసార హక్కుల్ని స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. ఇండియా బ్రాడ్ కాస్టింగ్, ఇండియా డిజిటల్ హక్కులతో పాటు అంతర్జాతీయ బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ హక్కుల్ని కూడా స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. ఏడాదికి రూ.3వేల 270 కోట్ల చొప్పున స్టార్ ఇండియా చెల్లించనుంది. దీనిలో భాగంగా 2018 నుంచి 2022 వరకు IPL ‘బ్రాడ్ కాస్టింగ్’ హక్కులు స్టార్ ఇండియా దగ్గర ఉండనున్నాయి. 20 ప్రముఖ కంపెనీలు వేలంలో పాల్గొనగా.. వాటిని స్టార్ ఇండియా వెనక్కునెట్టి, మీడియా హక్కుల్ని కైవసం చేసుకుంది.
వేలంలో స్టార్ ఇండియాతో పాటు సోనీ నెట్వర్క్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫాలోఆన్ ఇంటరాక్టివ్ మీడియా, తాజ్ టీవీ ఇండియా, టైమ్స్ ఇంటర్నెట్, సూపర్‌స్పోర్ట్ ఇంటర్నేషనల్, రిలయన్స్ జియో డిజిటల్, గల్ఫ్ DTH, గ్రూప్ ఎమ్ మీడియా, బెల్ ఎన్ ఈకోనెట్ మీడియా, సై యూకే, ESPN డిజిటల్ మీడియా, బీటీజీ లీగల్ సర్వీసెస్, బీటీ పీఎల్సీ, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సంస్థలు పోటీ పడ్డాయి. IPL తొలినాళ్లలో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ రూ. 8వేల200 కోట్లు వెచ్చించి టీవీ హక్కులు పొందింది. డిజిటల్ హక్కులను గత మూడేళ్ల (2015–17) కాలానికి నోవి డిజిటల్ సంస్థ రూ. 302.2 కోట్లతో చేజిక్కించుకుంది.













