భారత్ పై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరింపులు
ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసే ఏ దేశంపైన అయినా ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో భారత్‌తో సహా కొన్ని దేశాలకు ఇస్తున్న మినహాయింపులను పొడిగించరాదని ట్రంప్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులపై సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ నుండి చమురు కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించిన ఏ చర్య అయినా దేశ ఇంధన భద్రతకు, జాతీయ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.
ఐరాస ప్రకటించిన ఆంక్షలు తప్ప మరే ఇతర దేశమూ ప్రకటించే ఆంక్షలను తాము అనుసరించబోమని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇంతకు ముందు ప్రకటించిన విషయాన్ని పొలిట్‌బ్యూరో ఈ సందర్భంగా ప్రస్తావించింది. అమెరికా ఏకపక్షంగా ప్రకటిస్తున్న ఈ ఆంక్షలు చట్టవిరుద్ధమైనందున బిజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని, దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకని ఇరాన్ నుండి చమురు కొనుగోళ్లను కొనసాగించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.













