చంద్రబాబును చూసి సిగ్గుతెచ్చుకోండి: స్టాలిన్
సొంత రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీస్తున్నారని, కాని తమిళనాడులోని అణ్ణాడిఎంకె నాయకులు చేతకాని దద్దమ్మలా మోదీ ముందు చేతులు కట్టుకుంటున్నారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. తమిళనాడులోని ఈరోడ్ లో డీఎంకే పార్టీ బహిరంగసభలో మాట్లాడుతూ, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం సూార్తిేదాయకమన్నారు. ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలపై విమర్శలు కురిపించారు. వీరిద్దరూ కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
”బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుంది. తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎదుట సాష్టాంగపడిన, చేవ, తెగువ, వెన్నెముక లేనటువంటి పాలన తమిళనాడులో కొనసాగుతోంది. కావేరీ బోర్డు విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోంది. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ లకు ఎందుకు రావడం లేదు? ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడుతున్నారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని గతంలో డీఎంకే ఎలుగెత్తి చాటింది. ఇప్పుడు ఆ ఘోష ఏపీలో ప్రతిబింబిస్తోంది.













