జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసులు
విశాఖపట్నం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు అంతర్జాతీయ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభమవుతోంది. వారానికి 4 రోజులు (మంగళ, గురు, శని, ఆదివారాలు) ఈ విమాన సర్వీసును శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ నిర్వహించనుంది. ఈ విమాన సర్వీసు కొలంబోలో ఉదయం 7:10 గంటలకు బయలుదేరి 9:10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరిగి విశాఖ నుంచి 10:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు కొలంబో చేరుతుంది. ఈ సర్వీసు కోసం ఎయిర్‌బస్ నియో ఎ 320, ఎ 321 విమానాలను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వినియోగించనుంది. కొలంబో నుంచి బ్యాంకాక్, మలేషియా, లండన్, బీజింగ్ తదితర దేశాలకు కనెక్టివిటీ సర్వీసులు కూడా ఉన్నాయి. ఆయా దేశాలకు వెళ్లే ప్రయాణికులు విశాఖలోనే నేరుగా టికెట్ తీసుకోవచ్చు. కొలంబో నుంచి విశాఖకు రానున్న విమాన సర్వీసుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్వాగతం పలకనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు హరిబాబు, అవంతి శ్రీనివాస్ హాజరవుతున్నారు.













