జీఎస్టీపై 30న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం
జీఎస్టీ అమలులోకి రానున్న ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 30న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది.
జీఎస్టీ అమలులోకి రావడంతో దేశంలోని వివిధ వస్తువులు, సేవలపై 1500 వేర్వేరు స్లాబ్ రేట్లు అంతమవుతాయి. ఐదు స్లాబ్లలో (0, 5, 12, 18, 28) వస్తు, సేవలపై పన్నులు అమలు అవుతాయి. కేంద్రం విధించే ఎక్సైజ్, సేవల పన్నులు కానీ, రాష్ట్రాలు విధించే వ్యాట్ కానీ ఇక నుంచి ఉండవు. రాష్ట్రాలు విధించే 17 రకాల పన్నులు మాయమవుతాయి. నిత్యావసర వస్తువులకూ, విలాస వస్తువులకూ వేర్వేరు రేట్లలో పన్నులు ఉంటాయి. వ్యవసాయంపై ఎలాంటి జీఎస్టీ ఉండదు.
నిజానికి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అవలంబించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. దాదాపు 17సంవత్సరాల క్రితం నుంచి దీనిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని పరిశీలించేందుకు 2000 సంవత్సరంలోనే వాజపేయి ప్రభుత్వం అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీమ్ దాస్గుప్తా నేతృత్వంలో సాధికారిక కమిటీని ఏర్పరిచారు. ప్రస్తుత పన్ను వ్యవస్థ స్థానంలో జీఎస్టీని విధించాలని 2004లో అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్ కేల్కర్ సూచించారు. 2010 ఏప్రిల్ 1 కల్లా దేశమంతా జీఎస్టీని అమలు చేయాలన్న బృహత్తర లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నట్లు 2006 ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
జీఎస్టీకి ఒక భవిష్యత్ చిత్రపటాన్ని రూపొందించే బాధ్యతను ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీకి అప్పగించినట్లు 2007 ఫిబ్రవరి 28న చిదంబరం మరో సారి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ మేరకు ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ 2008 ఏప్రిల్ 30న నివేదిక సమర్పించింది. జీఎస్టీ పై ప్రజలను చర్చకు ఆహ్వానిస్తూ సాధికారిక కమిటీ 2009 నవంబర్ 10న బహిరంగంగా పిలుపునిచ్చింది. 2010 ఫిబ్రవరిలో ప్రభుత్వం వాణిజ్య పన్నుల కంప్యూటరీకరణకు ప్రాజెక్టును ప్రారంభించింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ 2011 ఏప్రిల్ 1 వరకు జీఎస్టీని వాయిదా వేశారు. ఎట్టకేలకు 2011 మార్చి 22న జీఎస్టీ అమలు చేసేందుకు 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 2011 మార్చి 29న ఈ బిల్లును స్థాయీ సంఘానికి నివేదించారు. 2012 డిసెంబర్ 31 నాటికి అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని 2012 నవంబర్ లో జరిగిన ఆర్థికమంత్రి, రాష్ట్రాల మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీని అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని 2013 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. బడ్జెట్ లో రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేటాయింపులు కూడా చేశారు. 2013లో పార్లమెంట్ స్థాయీ సంఘం కొన్ని మార్పులను సూచిస్తూ నివేదిక సమర్పించింది. అయితే 15వ లోక్ సభ రద్దు కావడంతో ఈ బిల్లుకు కాలదోషం పట్టింది.
2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీఏ అధికారంలోకి రాగానే జీఎస్టీపై చర్యలను వేగవంతం చేసింది. 2014 డిసెంబర్ 18న జీఎస్టీపై రాజ్యాంగ సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించింది. 2014 డిసెంబర్ 19న ఈ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2015 మే 6న బిల్లుకు ఆమోదం లభించింది. 2015 మే 12న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2015 మే 14న బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి నివేదించారు. రాజ్యసభలో సరైన మెజారిటీ లేనందువల్ల 2015 ఆగస్టులో జీఎస్టీకి బిల్లుకు అనుకూలంగా ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతును సమీకరించలేకపోయింది. అనేక చర్చలు, సంప్రదింపుల తర్వాత 2016 ఆగస్టు 3న రాజ్యసభ జీఎస్టీపై రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. జీఎస్టీకి చెందిన అత్యంత కీలకమైన అనుబంధ బిల్లులను లోక్ సభ 2017 మార్చిలో ఆమోదించగా, రాజ్య సభ ఏప్రిల్ 6న ఆమోదించింది. దీనితో దేశంలో ఒకే పన్ను వ్యవస్థను ఏర్పర్చేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆమోదించినట్లయింది.













