యూజర్లకు గుడ్ న్యూస్ : వాట్సాప్ లో మనీ ట్రాన్స్ ఫర్
మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. అతి త్వరలో నగదు బదిలీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు ప్రారంభించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని ప్రారంభించే పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. యూపీఐ ద్వారా బ్యాంకు నుంచి బ్యాంకుకు నగదు బదిలీ చేసే సౌకర్యాన్ని వాట్సాప్‌లో కల్పించే ప్రణాళికకు తుదిరూపు ఇచ్చింది. ప్రస్తుతం ‘వాట్సాప్ పేమెంట్స్ సెక్షన్’ అభివృద్ధి దశలో ఉందని బ్లాగ్ వెబ్సైట్ డబ్ల్యూఏబేటాఇన్ఫో పేర్కొంది. అయితే వాట్సాప్ పేమెంట్స్‌ను ఉపయోగించుకోవాలంటే తొలుత వాట్సాప్ పేమెంట్స్ అండ్ బ్యాంక్ టెర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సి ఉంటుందని బ్లాగ్ వివరించింది.
మొబైల్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రారంభించిన యూపీఐని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తోంది. దీనికి ఇప్పటి వరకు 20 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూస్) ఉన్నారు. ఈ సౌలభ్యాన్ని తమ వినియోగదారులకు అందించే ఉద్దేశంతో వాట్సాప్ ఇప్పటికే ఎన్పీసీఐతో చర్చలు జరిపింది. అలాగే కొన్ని బ్యాంకులతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. వియ్‌చాట్, హైక్ మెసేంజర్ వంటి మొబైల్ మెసేజింగ్ యాప్స్ ఇప్పటికే యూపీఐ పేమెంట్ సర్వీసులను అందిస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విధానాన్ని గతేడాది ఆగస్టులో ప్రారంభించారు. అప్పట్లో 21 బ్యాంకులకు ఈ సదుపాయం ఉండగా, తాజాగా 50 బ్యాంకులకు పెరిగింది.













