ఎన్నారైలకు ప్రత్యేక దత్తత పోర్టల్
పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే ప్రవాస భారతీయులకు శుభవార్త. ఇప్పటివరకు ఎన్నారైలు పిల్లలను దత్తత తీసుకోవాలంటే నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఆథరైజ్డ్ ఫారిన్ అడాప్షన్ ఏజెన్సీ (ఏఎఫ్‌ఏఏ) లేదా సెంట్రల్ ఆథారిటీ (సీఏ) ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవి ఒకే చేసిన తర్వాత ఛైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కార)కి దరఖాస్తులు పంపేవి. ఇదంత జరగడానికి చాలా సమయం పట్టేది. పైగా తమ దరఖాస్తు స్టేటస్ ఏంటి? కారలో పిల్లలకు సంబంధించిన సమాచారం సరిగా ఉందా లేదా? అన్న ఆందోళన ఎన్నారై దంపతులలో ఉండేది. ఇకపై అలాంటి ఆందోళన లేకుండా నేరుగా తమ దరఖాస్తుల స్టేటస్ ఆన్లైన్లో చూసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కార) తెలిపింది. దీంతోపాటు దత్తత తీసుకునే దంపతులకు ప్రత్యేకంగా ఐడీ, పాస్వర్డ్ అందజేయనున్నట్లు కార సీఈవో దీపక్ కుమార్ వెల్లడించారు. దీని ద్వారా ఒక్క క్లిక్‌తో తమకు కావాల్సిన పిల్లల సమాచారం, వయసు దరఖాస్తులో సరిగ్గా ఉందా? కార తమ దరఖాస్తుకు ఆమోదం తెలిపిందా లేదా? అనే విషయాలు నేరుగా తెలుసుకోవచ్చని వెల్లడించారు. అంతేకాదు పిల్లలను ఎప్పుడు దత్తత ఇచ్చే అవకాశం ఉంది? అనే విషయాలను కూడా తెలుసుకునే వీలుందని తెలిపారు.













