జిఎస్టీ శ్లాబుల కుదింపు?
ప్రభుత్వానికి రాబడి పెరిగితే వస్తు, సేవల పన్ను (జిఎస్టి) శ్లాబులను కుదించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. ఫరీదాబాద్‌లో ఆదివారం ఎన్ఎసిఐఎన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘దేశంలో మూడు నెలల క్రితమే జిఎస్టి అమలు ప్రారంభమైంది. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుకునేందుకు, చిన్నచిన్న పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వానికి రాబడులు పెరిగి ఆదాయం తటస్థ స్థితికి చేరుకుంటే జిఎస్టి శ్లాబులు కుదించటంలాంటి పెద్ద సంస్కరణల గురించి మనం ఆలోచించవచ్చు. ఆదాయం తటస్థ స్థితికి చేరుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేశారు.













