సార్ వచ్చారు : రాజ్యసభకు హాజరైన సచిన్
రాజ్యసభకు ఒక్కరోజు కూడా రావడంలేదంటూ మాజీ ఇండియన్ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ పై వస్తున్న ఆరోపణలకు ఆయన కళ్లెం వేశారు. సచిన్ మొత్తానికి రాజ్యసభకు హాజరయ్యారు. అతను ఎలాంటి ప్రశ్నలు అడగకపోయినా.. వచ్చి సభలో కూర్చున్నారు. సచిన్‌తోపాటు మరో నామినేటెడ్ ఎంపీ, బాక్సర్ మేరీ కోమ్ కూడా సభకు వచ్చింది.
ఈ మధ్య సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్.. సచిన్, రేఖల గైర్హాజరీ అంశాన్ని లేవనెత్తాడు. అసలు సభలో ఎప్పుడూ కనిపించని సచిన్, రేఖల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, వాళ్లను సభ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయ్ మాల్యాను సభ నుంచి బహిష్కరించినపుడు.. వీరిని మాత్రం ఎందుకు చేయకూడదు అని నరేశ్ అగర్వాల్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వివిధ రంగాల నుంచి నామినేట్ అయిన 12 మంది సభ్యులు ఎప్పుడూ సభకు రావడం లేదని అగర్వాల్ గుర్తుచేశారు.
వాళ్లకు ఆసక్తి లేకపోతే రాజీనామా చేయొచ్చు కదా అని అప్పట్లో ఆయన అన్నారు. 2012లో రాజ్యసభకు సచిన్ నామినేట్ అవగా.. అప్పటి నుంచి 348 రోజులు సభ నడవగా.. సచిన్ కేవలం 23 రోజులు హాజరయ్యాడు. రేఖ అయితే మరీ 18 రోజులు మాత్రమే సభలో కనిపించింది. బడ్జెట్ సెషన్, అంతకుముందు జరిగిన వింటర్ సెషన్లో ఒక్క రోజు కూడా వీళ్లు రాకపోయేసరికి రకరకాల వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.













