ఆర్ఎస్ఎస్ అభ్యర్థిని మారుస్తోందా?
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చేసిన కృషే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అదే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం వచ్చే అవకాశం కనిపించడం లేదని సందేహం వ్యక్తం చేసింది. ఒకవైపు మోడీ ప్రాభవం తగ్గుముఖం పడుతున్న క్రమంలో, ఆర్ఎస్స్ వ్యాఖ్యలు బిజెపిలో కలవరాన్ని సృష్టించాయి. వచ్చేయేడాది లోక్‌సభ ఎన్నికల తర్వాత హంగ్ తప్పదన్న సంఘ్ హెచ్చరికలు కమలనాథులను హడలెత్తిస్తోంది. వచ్చే ఆరు మాసాలు పరిపాలన సుప్తావస్థలోకి వెళ్లడం అనివార్యం. దేశ భద్రత ద ష్ట్యా రాజకీయ అస్థితరతలు ప్రతికూలమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే హంగ్సభ తప్పదన్న భావన కలుగుతోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ఇమేజీకి కౌంట్‌డౌన్ మొదలైందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వచ్చే యేడాది ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించినా, మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల్లో ఎదురైన ఓటమి కాషాయపార్టీకి ప్రమాదఘంటికలే. 2014 నాటి ఫలితాల్ని మోడీ గానీ, బీజేపీ గానీ పునరావ తం చేయలేవని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ముందుగానే గ్రహించాయి. కనిష్టంగా 50 సీట్లు, గరిష్టంగా 100 సీట్లను అధికార పార్టీ కోల్పోయే ప్రమాదం ఉంది. అటు పార్టీలోనూ,ఇటు సంఘ్ పరివార్‌లోనూ కొత్త ప్రధాని అభ్యర్థిపై చర్చజరగడం రాజకీయ పండితులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని సంఘ్ పేర్కొన్నది. మోడీ, షా ప్రతిష్ట మసకబారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా, నాగపూర్ ఎంపీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ప్రధానిగా తెరపైకి తేవాలని మోహన్ భగవత్‌కు లేఖలు వస్తుండటం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పరిస్థితులను, అనుకూలంగా మలచుకోవడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలం అవుతున్నాడు. సరైన వ్యూహాలు, శక్తియుక్తులు ఆయనలో లోపించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అనేకంటే భాజపా ఓడినట్లుగా భావించాలి. ఈ మూడు రాష్ట్రాల్లో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. బీజేపీ ప్రభుత్వాల పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానే ఎదుటి పక్షం నెగ్గింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో రెండు జాతీయ పార్టీలకు లభించిన ఓట్లు, సీట్లే ఇందుకు నిదర్శనం. ఉచితానుచిత హామీలు ఎన్ని గుప్పించినా కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతోనే ఒడ్డుకు చేరింది. 0.1శాతం ఓట్లతోనే మధ్యప్రదేశ్‌లో అధికారం దక్కించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో సేవ్ డెమొక్రసీ నినాదంతోపాటు సీబీఐ అంతర్యుద్ధం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా, రాఫెల్, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం విపక్షాల ప్రధాన అస్త్రాలుగా మారే అవకాశం ఉందని ఆర్గనైజర్ కథనం వివరించింది.
ఇటీవల గడ్కరీ వేర్వేరు సందర్భాల్లో కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. తన వ్యక్తిగత అభిప్రాయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో విజయ్ మాల్యాను ఉటంకిస్తూ, నిశ్చితాభిప్రాయం వ్యక్తంచేసి అందరి దష్టిని ఆకర్షించారు. ఒకసారి సకాలంలో రుణం చెల్లించనంత మాత్రాన దొంగగా పేర్కొనడం తగదు. వ్యాపారంలో ఒడిదొడుకులు సహజమే. బీజేపీలో కొందరు మాట్లాడేందుకు ఇష్టపడతారు. అలాంటి వాళ్లు కాస్త తక్కువ మాట్లాడితే మంచిది అంటూ హితవు పలికారు. ఇదిలావుంటే, మూడు రోజుల కిందట జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొందరు ఎంపీలు అసహనం వ్యక్తంచేశారు. మునుపటి ఎన్నికల హామీ అయిన రామమందిరం అంశాన్ని లేవనెత్తారు. బాబ్రీ మసీదును కూల్చిన చోటే మందిరం నిర్మిస్తామన్న మాటకు కట్టుబడి వుండాలని, తక్షణమే చర్యలు చేపట్టాలని స్వరం పెంచారు. మందిరం అంశంలో ప్రభుత్వం ఏం చేసింది? అంటూ ఎంపీ రవీంద్ర కుశ్వాహ ప్రశ్నించగా, ఘోషి ఎంపీ హరి నారాయణ్ రాజ్బీర్, మరికొంతరు ఎంపీలు మద్దతు పలికారు. దీనిపై పార్లమెంటులో బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమావేశానికి రానందున, హోంమంత్రి రాజ్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీటింగ్‌ను నిర్వహించారు. గతంలోనూ ఎంపీలు ఇబ్బందికర ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేశారు. 2016లో నితిన్‌గడ్కరీ ప్రధానిని ప్రశ్నిస్తుండగా, ఆయన మాటలు పూర్తవకుండానే బలవంతంగా కూర్చునేలా చేశారు. ఈ కారణంగా పార్టీ పెద్దల తీరుపై ఎంపీల్లో అసంతప్తులు నివురుగప్పి వున్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా సూటిగానే చెప్పింది. బీజేపీకి మిగిలివున్న ఏకైక అస్త్రం రామమందిరం. అది 2014 ఎన్నికల్లోనే సంధించాం అని తేల్చిచెప్పింది. దసరా నాడు కూడా భగవత్ ఇదే విషయాన్ని చెప్పారు. రామ మందిరం నిర్మాణమే హిందువుల విశ్వాసాన్ని నిలబెడుతుంది. తద్వారానే బీజేపీకి ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు ఆర్ఎస్ఎస్ నేత, మోడీ భక్తుడు కిశోర్ తివారి చేసిన ప్రకటన బీజేపీకి తలవంపులుగా మారింది. 2019 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని ప్రకటించాలని ఆయన సంఘ్‌కు సూచించారు. గత ఎన్నికల్లో చాయ్ పే చర్చ ద్వారా మోడీ ఇమేజీని దేశవ్యాప్తం చేసింది తివారీనే. అలాంటి వ్యక్తే ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్దమవుతుంది. తివారి కేవలం సాదాసీదా బీజేపీ కార్యకర్త మాత్రమే కాదు. మహాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగ్రికల్చరల్ టాస్క్ ఫోస్క్కు సారథిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరోవైపు నితిన్ గడ్కరీ తాను రేస్‌లో లేనంటున్నా మరోవైపు ఆయనే ప్రధాని అభ్యర్థి కాగలరని చాలామంది ఎంపిలు, బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ తన పదవిని నిలబెట్టుకోవడంకోసం, తన ఇమేజ్ను పెంచుకునేందుకు ఏమి చేయగలరని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













