త్వరలో రూ.200 నోటు!
నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించడానికి త్వరలో రూ.200 విలువైన నోట్లను అందుబాటులో తీసుకువచ్చేందుకు భారతీయ రిజర్ బ్యాంక్ (ఆర్బీఐ) రంగం సిద్ధం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో రూ.200 నోట్లలో అదనపు భద్రత ప్రమాణాలు చేర్చారు. ప్రస్తుతం వీటిని వివిధ కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. ఈ నోట్లను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఇదివరకే సమ్మతి తెలిపింది. రూ.100- రూ.500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. పెద్దనోట్లను గత ఏడాది నవంబరులో రద్దు చేసిన తర్వాత తిరిగి కొత్త నోట్లను వాటి స్థానంలో తీసుకువచ్చే క్రతువు దాదాపు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో సరికొత్త విలువైన నోటును తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్నారు.













