యూపీలో ఇది జోక్ కాదు.. నిజం : రైతు రుణం రూపాయల్లో మాఫీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీ చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రద్దు అవుతున్న అప్పు మొత్తమే ఇప్పుడు అలజడి రేపుతోంది. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకరికి రూపాయి, మరొకరికి రూపాయిన్నర, మరొకరికి మూడు రూపాయలు ఇలా చాలా మంది రైతులకు మాఫీ పత్రాలు ఇవ్వటం కలకలం రేపుతోంది.
శంబునాథ్ అనే రైతుకి రూ.28వేల 812 అప్పు ఉంది. అతని అకౌంట్ నుంచి 12 రూపాయలు మాఫీ అయ్యి.. కట్టాల్సిన అప్పు 28వేలుగా చూపిస్తూ బ్యాంక్ నుంచి లేఖ వచ్చింది. షాజహాన్ పూర్ జిల్లాలోని రాంప్రసాద్ అనే రైతుకి రూపాయిన్నర మాఫీ అయ్యింది. చిద్ది అనే మరో రైతుకి రూపాయి రుణం మాఫీ అయినట్లు బ్యాంక్ వాళ్లు తెలియజేశారు.
యూపీ రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది రైతులకు 36వేల కోట్ల రూపాయల రైతు అప్పులు మాఫీ చేస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ క్రమంలో రైతు రుణాల మాఫీకి సంబంధించి పత్రాలు అందిస్తున్నారు. ఆ సమయంలో ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుచూశాయి. దీనిపై మంత్రి శ్రీకాంత్ శర్మ స్పందించారు. బ్యాంకుల్లో సాంకేతిక సమస్య వల్లే ఇలాంటి తప్పిదాలు జరిగాయని.. వీటన్నింటినీ పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. రైతులను యూపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు.













