అప్పుడు అద్వానీని అరెస్ట్ చేశారు.. ఇప్పుడు మంత్రయ్యారు!
సరిగ్గా 26 ఏళ్ల కిందట బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్కే అద్వానీ రథ్ యాత్ర చేపట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు యాత్ర చేయాలని అప్పట్లో ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో అద్వానీ బీహార్‌లోకి ప్రవేశించారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీనికోసం ఇద్దరు అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించారు. అందులో ఒకరు రాజ్‌కుమార్ సింగ్. ఆయనే ఇప్పుడు మోదీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేయడం గమనార్హం.
అక్టోబర్, 1990లో ఆర్కే సింగ్ ఐఏఎస్ ఆఫీసర్. బీహార్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వ ప్రత్యేక హెలికాప్టర్లో ఆర్కే సింగ్ పాట్నా నుంచి సమస్తిపూర్‌కు వెళ్లారు. ఆయన వెంట ఐపీఎల్ ఆఫీసర్ రామేశ్వర్ ఓరాన్ కూడా ఉన్నారు. అద్వానీ ఉన్న సర్క్కూట్ హౌజ్‌కు వెళ్లి.. మిమ్మల్ని అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ అయింది అని చెప్పింది ఆర్కే సింగే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అద్వానీ తీసుకొని మళ్లీ పాట్నా వెళ్లారు. ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మసాంజర్ గెస్ట్ హౌజ్‌కు అద్వానీని తరలించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ అద్వానీ చేసిన ఈ రథ్ యాత్రే బీజేపీ రాతను మార్చేసింది.
ఈ రథ్ యాత్ర ముగిసిన ఆరేళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోంమంత్రి అయ్యారు. ఇప్పుడు అద్వానీ కేవలం ఎంపీ పదవికే పరిమితమవగా.. ఆయను అప్పట్లో అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ మంత్రి అయ్యారు. 1975 బ్యాచ్ బీహార్ కేడర్ ఆఫీసర్ అయిన రాజ్‌కుమార్ సింగ్.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. బీహార్‌లోని ఆరా నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.













