ఎన్నారైల పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
ప్రవాస భారతీయుల (ఎన్నారైలు) వివాహాలు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపింది. లోక్సభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఈ అంశంపై ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఓ నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నారైల వివాహాలకు సంబంధించి అన్ని అంశాలను ఏజన్సీ చర్చిస్తుందని మంత్రి వెల్లడించారు. ఎన్నారై కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ అరవింద్ కుమార్ గోయల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపిందని సింగ్ సృష్టం చేశారు. ఎన్నారైలను వివాహం చేసుకున్న యువతులు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలపారు. ఎన్నారైల పెళ్లిలకు సంబంధించి చట్టాలు, విధానాలు మరింత పగడ్బందీగా ఉండాలని కమిటీ తన సిఫార్సుల్లో సూచించింది.













