రామమందిరంపై అమిత్ షా సంచలన ప్రకటన
అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. మరో నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని ఆ పార్టీ సారథి, కేంద్ర హోంమంత్రి సంచలన ప్రకటన చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవాంతరాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రామాలయం నిర్మించి తీరతామని పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని పాకూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. శ్రీరాముడు జన్మించిన స్థలంలో ఆలయం నిర్మించాలని వందేళ్లుగా ప్రజలు కోరుతున్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు చెప్పింది. ఇక ఇంకో నాలుగు నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తున రామాలయం నిర్మిస్తాం అని అమిత్ షా ప్రకటించారు. అయోధ్య తీర్పుపై ఇటీవల దాఖలైన అన్ని రివ్వూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అమిత్ షా ఈ డెడ్‌లైన్ ప్రకటించడం గమనార్హం.













