నిత్యావసరాల రవాణాలో రైల్వేదే అగ్రస్థానం
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినప్పటి నుంచి నిత్యావసర సరుకుల రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లను తిప్పుతోంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. గత ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్షన్నర వ్యాగన్ల నిత్యావసరాలు రవాణా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇందులో బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు, ఉల్లి, పండ్లు, కూరగాయలు, పాలు, వంట నూనె తదితర నిత్యావసరాలున్నాయి. వీటితో పాటు థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు, వ్యవసాయ రంగానికి ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైనవి రవాణా చేస్తోంది. కరోనాను జాతీయ విపత్తుగా భావించి సరుకు రవాణాలో డెమరేజ్, వార్ఫేజ్ ఛార్జీలను ఎత్తేసింది. అవసరాన్ని బట్టి మరిన్ని రాయితీలు కల్పిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.













