‘మేడ్ ఇన్ చైనా’ కనిపిస్తోంది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఘోరంగా విఫమైందని, ఇప్పుడున్నదంతా ‘మేడ్ ఇన్ చైనా’ మాత్రమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనల మేరకు బిజెపి భారతదేశాన్ని కులాల ఆధారంగా విభజిస్తోందని రాహుల్ ఆరోపించారు. నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించిన భారత్ ఉత్పత్తి ఘోరంగా విఫలమైంది, ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా తయారీ వస్తువులు కనిపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ వారం రోజుల నుండి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తుండటం తెలిసిందే. నరేంద్ర మోదీకి అబద్ధాలు చెప్పటం అలవాటుగా మారిందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కలిసి కట్టుగా కృషిచేయాలని, అప్పుడే బిజెపిని ఓడించగలుగుతామని రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీ అబద్ధపు మాటలన్నీ ప్రజల ముందు పెట్టాలని అన్నారు. ‘స్వచ్చ భారత్’ గురించి తెగ మాట్లాడుతున్నారు, తాను మాత్రం ‘సఛ్ భారత్’ (నిజమైన భారత్) కావాలంటున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై అసమ్మతి పోరాటం ప్రారంభించిన జెడి(యు) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ గురువారం ‘వారసత్వ పరిరక్షణ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సదస్సులో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.













