రాహుల్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ అధికారికంగా రాజీనామా ప్రకటించారు. పార్టీ భవిష్యత్ బాగుండాలంటే జవాబుదారీతనం ముఖ్యమని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. దేశానికి జీవనాడి వంటి పార్టీకి అధ్యక్షుడిగా సేవలందించినందుకు గర్వంగా ఉన్నదన్నారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తద్వారా తన రాజీనామాపై సాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) వెంటనే పార్టీ అధ్యక్షుడిగా వేరొకరిని ఎంపిక చేయాలని సృష్టం చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మే 27న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఘోర ఓటమి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను అందించారు. సీడబ్ల్యూసీ ఆ లేఖను తిరస్కరించినా, నాటి నుంచి హై డ్రామా కొనసాగుతున్నది. ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆయన కొనసాగాలంటూ పార్టీ కార్యకర్తల ధర్నాలు, నేతల మూకుమ్మడి రాజీనామాలూ కొనసాగినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. తన రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన ఆదర్శరాలు, విలువలతో అందమైన ఈ భారత్‌కు జీవనాడిగా మారిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా సేవలందించినందుకు గర్వ పడుతున్నా. దేశ ప్రజల, నా పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలను రుణపడి ఉంటాను అని ట్వీట్ చేశారు.













