త్వరలో యువరాజుకు పగ్గాలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును ఖరారు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌లోగా పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే పార్టీ గుర్తింపు, ఎన్నికల చిహ్నాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు పార్టీ ఎన్నికల షెడ్యూలును సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖరారు చేసిన ప్రక్రియ ప్రకారం అక్టోబర్‌లో రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. దీనికోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.













