రాహుల్ వ్యూహం…ఏర్పాట్లు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ కర్నాటక తదితర రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలకు అప్పుడే సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తాజా వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోకసభ ఎన్నికలను 2019కి బదులు 2018లో నిర్వహించవచ్చునని రాహుల్ అనుమానిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. భాజపాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే తగు ఏర్పాట్లు చేసుకోవటం మంచిదని రాహుల్ గాంధీ పార్టీవారికి స్పష్టం చేశారని తెలిసింది.
2018లో చత్తీస్గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, త్రిపుర శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలనుకుని మోదీ భావించిన పక్షంలో ఈ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే జరిగితే తగిన వ్యూహాన్ని ఇప్పటినుంచే అమలు చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు ఏఐసీసీ నాయకుడొకరు తెలిపారు. 2018 ఎన్నికలకు ఒక కార్యాచరణ పథకాన్ని రాహుల్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని, దీనిపై మరింత చర్చ జరిపిన అనంతరం తుది కార్యచరణను ఆచరణలో పెడతారనే మాట వినిపిస్తోంది.













