త్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ముమ్మారు తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా దీనిపై ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది. దీంతో ప్రస్తుతమున్న ఆర్డినెన్సు స్థానంలో చట్టం వచ్చేసింది.
నిజానికి మూమ్మారు తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లో తీర్పునిచ్చానా, ఇంకా అది కొనసాగుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ చట్టం విషయంలో ముందడుగు వేసింది. అదే డిసెంబరులో బిల్లును ప్రవేశపెట్టిన లోక్సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో తగిన బలంలేక వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో మరోసారి ఈ బిల్లును తీసుకొచ్చింది. జూలై 25న లోక్సభలో ఆమోదం పొందిన బిల్లును జులై 30న రాజ్యసభ ముందుకు తీసుకొచ్చారు. పెద్దల సభలో ఎన్డీయేకు తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. కొన్ని పార్టీలు ఓటింగ్ దూరంగా ఉండటం, మరికొన్ని పార్టీలు వాకౌట్ చేయడం ప్రభుత్వానికి కలిస్తోంది. దీంతో 99-84 ఓట్ల తేడాతో తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. తాజాగా రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది.













