యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ?
ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్రపతి ఎన్నికలపైనే ఉంది. త్వరలోనే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనుండడంతో కాబోయే రాష్ట్రపతి ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఎన్డీఏ, యూపీఏ ఇప్పటికే నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా రాష్ట్రపతి పదవిని తామే కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ దూకుడుడా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బాగా కలసి వచ్చే అంశం. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములు కావడం బీజేపీలో జోస్ పెంచుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలా? అనే పనిలో బీజేపీ అధిష్టానం తలమునకలై ఉంది. మరో వైపు తాము కూడా రాష్ట్రపతి పదవి కోసం అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. జేడీయూ, లెఫ్ట్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలు ఈ పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపారు. నితీష్ కుమార్, సీతారాం ఏచూరీ సోనియా గాంధీతో ఈ విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ ప్రదర్శిస్తున్న దూకుడును తగ్గించాలంటే మళ్లీ ప్రణబ్ ముఖర్జీనే రెండోసారి రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.













