కర్నూలు వాసికి రాష్ట్రపతి పతకం
జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ ఎస్పీగా పనిచేస్తున్న కర్నూలు వాసి డాక్టర్ జి.వి.సందీప్ చక్రవర్తికి ప్రత్యేక గుర్తింపు లభించింది. 370, 35(ఏ) అధికరణాలను కేంద్ర ప్రభుత్వం తొలగించిన అనంతరం తలెత్తిన క్లిష పరిస్థితుల్లో ధైర్యసాహసాలతో సేవలందించినందుకు కేంద్రం ఆయనకు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రకటించింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సైతం పోలీసు పతకం ఇవ్వడం విశేషం. చక్రవర్తి కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సివిల్స్ రాసి 2014 బ్యాచ్ ఐపీఎస్‌గా ఎంపికై జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి డాక్టర్ రామ్ గోపాల్‌రావు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.













