మీడియా పాత్రను మెచ్చుకున్న మోదీ
దేశ ప్రజలను చైతన్యపరుస్తున్న విషయంలో మీడియా పాత్రను ప్రధాని మోదీ విశేషంగా కొనియాడారు. ఇవాళ ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. బీజేపీ పార్టీ నిర్వహించే దివాళీ మిలన్ సమారోహ్ వార్షిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత కాల స్మృతులను నెమరేసుకున్నారు. మీడియాతో తనకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పనిచేసినప్పుడు మీడియాతో రెగ్యులర్గా పరిచయాలు ఉండేవన్నారు. రాజకీయ నేతలు ఏ అంశంపై ఫోకస్ పెట్టాలన్న విషయాన్ని మీడియానే సూచిస్తుందని ప్రధాని తెలిపారు. ఒకప్పుడు తాను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా, మీడియా తనకు అందుబాటులో ఉండేది కాదు అని, ఇప్పుడు సమయం మారిందని, అందుకే మీడియా మిత్రులతో ఎక్కువ సేపు మాట్లాడడం వీలుకావడం లేదన్నారు. ప్రజలను చైతన్యపరుస్తున్న అంశంలో మీడియా పాత్ర బాగుందన్నారు. స్వచ్ఛభారత్ ఉద్యమానికి మీడియా ఇచ్చిన సహాకారాన్ని ఆయన మెచ్చుకున్నారు. రాజకీయ పార్టీల్లో ఉన్న స్వేచ్ఛ గురించి ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉందని, రాజకీయ పార్టీలు పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అవసరమని, అప్పుడే భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయన్నారు.













