నవభారత్ ఆవిష్కరణకు ఉత్తేజం…
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో నవభారత్ ఆవిష్కరణకు ఉత్తేజం లభిస్తుందని, ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబయి, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులను ప్రారంభించిన అనంతరం ఈ ప్రాజెక్టుతో మేక్ ఇన్ ఇండియా ఆశయాలు మున్ముందుకు సాగుతాయని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలుపెట్టిన అబే.. భారత్ తో జపాన్ అనుబంధం ప్రత్యేకమైనదన్న ఆయన మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్న దేశం జపానేనని తెలిపారు.
భారత్-జపాన్ల చేతులు కలిస్తే అన్ని సుసాధ్యాలే అని చెప్పిన అబే.. జై జపాన్-జై ఇండియా నినాదంతో ఇరు దేశాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తన తదుపరి పర్యటనలో మళ్లీ ఇక్కడికి వస్తే మోదీతో కలిసి షింకసెన్(బుల్లెట్ ట్రైన్) లో కలిసి ప్రయాణించాలనుకుంటున్నానని షింజో అబే ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా భారత్ తో మరిన్ని వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటామని ఆయన ప్రకటించారు.భారత్, జపాన్ల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఇరువురు నేతలు అన్నారు. అహ్మదాబాద్లో శంకుస్ధాపన కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో మన స్వప్నాలు ఫలించేలా దేశం సగర్వంగా ముందుకు సాగేందుకు బాటలు పడతాయని అన్నారు.
భారత్–జపాన్ల మధ్య ఒప్పందాలు
భారత్, జపాన్ల మధ్య వివిధ అంశాలపై 15 ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ విద్యా, క్రీడల మార్పిడిపై భారత క్రీడా సాధికార సంస్థ, నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్శిటీల మధ్య ఒప్పందం కుదిరింది. పరిశోధనా రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదిరింది. డిబిటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.













