పాస్ పోర్టు ఛార్జీల్లో 10 శాతం రాయితీ
ఎనిమిదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు పాస్‌పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 10శాతం రాయితీ కల్పించనున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. పుదుచ్చేర్చిలోని కరైకల్ పోస్టాఫీసులో పాస్‌పోర్టు సర్వీసు కేంద్రాన్ని (పీవోపీఎస్కే) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు, వృద్ధులకు పాస్ పోర్టు ఛార్జీలు తగ్గించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వీలైనంత త్వరగా పాస్‌పోర్టును అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పాస్‌పోర్టు పొందేందుకు ప్రస్తుతం ఉన్న పద్ధతిని మరింత సులభతరం చేయాలని చూస్తున్నాం అని మంత్రి తెలిపారు. దేశంలో ఇప్పటికే 60 పీవోపీఎస్కే కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీటి సంఖ్యను 236 చేయాలన్న యోచనలో ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 2017లో 19 శాతం అధికంగా పాస్‌పోర్టు అప్లికేషన్ల ప్రొసెసింగ్ జరిగింది. కరైకల్‌లో ప్రారంభించిన పీవోపీఎస్కే కేంద్రం ద్వారా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు ఈ సేవలు పొందుతాయని ఆమె చెప్పారు.













