కలిసిన రెండాకులు
తమిళనాడులోని అధికార అన్నాడిఎంకెలో గత ఏడు నెలలుగా కొనసాగుతున్న వైరివర్గాల వివాదానికి తెరపడిండి. సిఎం పళని స్వామి, రెబెల్ నేత పన్నీర్ సెల్వం మధ్య కుదిరిన రాజీతో సమస్య పరిష్కారమైంది. షరతులమీద షరతుల చందంగా సాగిన వివాదానికి తెరదించుతూ రెండువర్గాలు విలీనమయ్యాయి. వారాల తరబడి సాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన అన్నాడిఎంకె వర్గాలు, పార్టీ అధినేత శశికళ ఉద్వాసనకూ చర్యలు తీసుకుంటామని తెలిపాయి. తాజా విలీన ఒప్పందంలో భాగంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన విధులు నిర్వహిస్తారు. ఈ నియామకంతో శశికళ బంధువు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటి దినకర్‌తోపాటు ఆయన సారధ్యంలోని శిబిరం కూడా నిర్వీర్యమైపోయింది. ఒకరినొకరు అన్నా అని పిలుచుకున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలు రెండు వర్గాల విలీనాన్ని చారిత్రకంగా అభివర్ణించారు.













