భారత రాయబారులుగా ఉండాలి : గవర్నర్
యువ ప్రవాసులు తమ దేశాల్లో భారత రాయబారులుగా వ్యవహరించాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఆకాంక్షించారు. కేంద్ర విదేశీ వ్వవహారాల శాఖ నిర్వహిస్తున్న నో ఇండియా ప్రోగ్రాం (భారతదేశాన్ని తెలుసుకునే కార్యక్రమం)లో భాగంగా 40 మందితో కూడిన యువ ప్రవాసుల బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారత మూలాలు కలిగిన యువ ప్రవాసులు భారత దేశంలోని బహుళ సాంస్కృతిక వారసత్వం తదితర విషయాలను అవగతం చేసుకోవడానికి నో యువర్ ఇండియా ప్రోగ్రాం ఉపకరిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల ద్వారా పట్టమ సౌకర్యాలను గ్రామాలకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టాయన్నారు. 9 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధి బృందం కొండపల్లి గ్రామం, హైదరాబాద్ నగరం, టి హబ్, హైటెక్ సిటీ, వరంగల్ తదితర ప్రాంతాలను సందర్శిస్తున్నది. ఈ సమావేశంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్ సింగ్, హైదరాబాద్ పాస్పోర్టు అధికారి ఇ.విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













