త్వరలో నిర్భయకేసు దోషులకు మరణశిక్ష
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేసేలా పాలకులను కదిలించిన నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటి వరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న వినయ్‌శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు ఉరి తీయాలని బ్లాక్ వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఉరి తీసే తలారీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం కానీ, తాత్కాలికంగా ఎక్కడైనా పని చేస్తున్న వారిని తీహార్ జైలుకు బదిలీ చేసి.. శిక్షను అమలు పరుచాలని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరి తీయాల్సి ఉంది.













