న్యూఢిల్లీ-గన్నవరం విమాన సర్వీస్
చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 1 నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రాయానికి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు విమాన ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు, టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఈ సంస్థ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి గన్నవరానికి రోజూ 20 ఏటీఆర్ విమాన సర్వీస్‌లను నడుపుతోంది. అక్టోబర్ 1న 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ 320 విమానం న్యూఢిల్లీలో మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరి సాయంత్రం 3:20కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4:00 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 6:25కు ఢిల్లీ చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ నుంచి గన్నవరం టికెట్ ప్రారంభ ధర రూ.5,079గా, ఇక్కడ నుంచి ఢిల్లీకి రూ.5,264గా నిర్ణయించారు.













