ఏం చెప్పారు..?
ఏపీలో కులరాజకీయాలు పీక్స్ కు చేరాయి. జనసేన, వైసీపీ మధ్య కౌంటర్ల హోరు కొనసాగుతోంది. ముఖ్యంగా కాపు రాజకీయాలపై ఇరుపార్టీలు గట్టిగా గురిపెట్టాయి. ఈ సారి గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న జనసేనాని.. వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. దీనికి ప్రతిగా వైసీపీలోని కాపు నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. అంతేనా వైసీపీ తరపున ముద్రగడ, జనసేన కోసం హరిరామజోగయ్య సైతం ఎంటరయ్యారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ రాజకీయ యుద్ధాన్ని.. కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఫైట్ గా చూపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్రవిరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా ద్వారపురెడ్డిని విమర్శించిన పవన్ ను కాపునేతలతో జగన్ టార్గెట్ చేయిస్తున్నారు. దీంతో నేరుగా రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తకుండానే, రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపుకు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం కులరాజకీయాలు టాప్ గేర్ లో వెళ్తుండగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఓ ట్వీట్ చేశారు. ఏపీలోని ప్రతీఒక్కరు తమ ఓటు బ్యాంక్ అన్నారు విజయసాయి. అంతవరకూ బాగానే ఉంది. అయితే బ్రిటీష్ వారిలా విపక్షపార్టీలు.. కుల, మత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తమపార్టీ విధానం అది కాదన్నారు.
మరి అదే నిజం అయితే వారాహి యాత్రలో పవన్ విమర్శలతో వెళ్తుంటే.. దాన్ని కౌంటర్స్ తో సరిపెట్టాల్సింది పోయి, మళ్లీ వైసీపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? నార్మల్ గానే పవన్ ప్రసంగాలు చేస్తున్నప్పుడు.. ఊగిపోతుంటారు. అందులోనూ మరి అతన్ని కెలికితే.. ఆ విమర్శలు హద్దులు దాటతాయని రాజకీయ పరిజ్ఞానం లేనివారికి తెలుసు. అలాంటప్పుడు ఎప్పటికప్పుడు ఎవరో ఓ మంత్రి లేదా వైసీపీ ఎమ్మెల్యే.. ఎందుకు పవన్ ను పదేపదే రెచ్చగొడుతున్నారు. అంటే అవి కుల రాజకీయాల కిందకు రావని విజయసాయిరెడ్డి లాంటి నేతలు అనుకుంటున్నారా.. ఏమో ఇవన్నీ చూస్తే సగటు ఆంధ్రుడికి ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి మరి.













