ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్..! వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం దాదాపు పదేళ్లుగా వార్తల్లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను పదేళ్లపాటు రాజధానిగా ప్రకటించింది కేంద్రం. ఈ ఏడాది జూన్ తో ఆ గడువు ముగుస్తుంది. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పటికీ రాజధానిని నిర్మించుకోలేకపోయింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అయితే దీనికి న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో రాజధాని వ్యవహారం ఎటూ తేలకుండా అలాగే ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎటూ తేల్చని నేతలు ఇప్పుడు మళ్లీ హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పదేళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారని.. అయితే ఏపీకి ఇంకా రాజధాని లేకపోవడంతో దాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించాలనేది ఆయన డిమాండ్. విశాఖను రాజధానిగా చేయాలనుకున్నా న్యాయపరమైన చిక్కుల వల్ల అది సాధ్యం కాలేదని.. అందుకే తాము మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అప్పటివరకూ హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
వాస్తవానికి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి పరిపాలన సాగింది. అయితే ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ మెజారిటీ కార్యాలయాలను ఖాళీ చేసి తాత్కాలిక రాజధాని అమరావతికి తరలించింది. అప్పటి నుంచి అమరావతి నుంచే ఏపీ పాలన సాగింది. అయినా హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించకుండా తమ దగ్గరే ఉంచుకుంది ఏపీ ప్రభుత్వం. అదే సమయంలో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలనే ఉద్దేశంతో అనేక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మిస్తామని వెల్లడించింది.
అయితే 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వెంటనే హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేసింది. దీంతో ఏపీకి హైదరాబాద్ లో చోటు లేకుండా పోయింది. మరోవైపు.. టీడీపీ హయాంలో అమరావతి రాజధానికి అంగీకరించిన వైసీపీ.. ఆ తర్వాత మాట మార్చింది. అమరావతిలో అనేక కుంభకోణాలు జరిగాయని.. అందుకే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. దీనిపై రైతులు, ప్రజాసంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఇది చిక్కుల్లో పడింది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకుంది. ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని. వైసీపీ ఆశించిన మూడు రాజధానులు ఇప్పట్లో సాకారమయ్యేలా లేవు. నాడు వైసీపీయే హైదరాబాద్ లో భవనాలన్నింటినీ ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పుడు మళ్లీ హైదరాబాదే ఉమ్మడి రాజధాని కావాలంటోంది.













