ఆమె కాంగ్రెస్ లో చేరినా.. వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు
సీఎం జగన్ తరపున షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్టు దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదు. అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుతా. మేము రాయబారాలు చేయాల్సిన పనిలేదు. ప్రజలే జగన్ను మరోసారి ఆశీర్వదించి సీఎం చేస్తారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతారో, లేదో సమాచారం లేదు. ఆమె కాంగ్రెస్లో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. వైసీపీ నష్టపోకుండా చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నాం. వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతోనే సీట్ల మార్పు, వచ్చే ఎన్నికల్లో పార్టీ నష్టపోకుండా ఉండేందుకే ఈ మార్పులు. వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ మారుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అందరికీ న్యాయం చేయడం సాధ్యపడదు. గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై వ్యతిరేకత మేరకు సీట్ల మార్పు ఉంటుంది. ఎన్ని స్థానాల్లో మార్పులుంటాయనేది ఇప్పుడే చెప్పలేం అని అన్నారు.













