కాంగ్రెస్ లో ‘షర్మిల’ పాత్ర..?
వైఎస్సార్ ఆశయసాధనకోసం కాంగ్రెస్ లో పనిచేస్తానన్నారు వైఎస్ షర్మిల. బ్రదర్ అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో .. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత హస్తం పార్టీది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాను.’ అని షర్మిల తెలిపారు.
అయితే షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి రాహుల్, ఖర్గే టీమ్.. పక్కా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పచెప్పి, ఎన్నికల రణరంగంలో పోరాటానికి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే సరైన నాయకుడు కనిపించడం లేదు. కొందరు సీనియర్లు ఉన్నప్పటికీ, వారు వారి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి అయితే పార్టీని నడిపించడం సులువవుతుంది. అందునా వైఎస్సార్ అభిమానులు ..రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు.
వైసీపీ నాయకుల్లో చాలా మంది దివంగత వైఎస్సార్ డైహార్డ్ ఫ్యాన్స్. సీఎం జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నప్పటికీ, వారికి మరో అవకాశం లేకపోవడంతో … వైసీపీలోనే ఉంటూ వస్తున్నారు. పోనీ కాంగ్రెస్ లోకి వెళ్థామా అంటే.. ఆపార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. అందుకే ఇన్నాళ్లు.. వారు ఫ్యాన్ లోనే ఉన్నారు. ఇప్పుడు షర్మిల .. కాంగ్రెస్ నేతగా మారారు. ఇక .. షర్మిల తల్లి వైెఎస్ విజయలక్ష్మి.. ఎప్పుడు కూతురి వెన్నంటే ఉంటూ వస్తున్నారు. ఇన్నర్ గా చూస్తే.. ఆమె కూడా రాజకీయంగా తమ పలుకుబడి ఉపయోగించి, నేతలను రప్పించే అవకాశం ఉంది. పార్టీ పగ్గాలు కనుక షర్మిలకు అందితే, మళ్లీ వారి హవానే నడుస్తుంది. దీంతో చాలా మంది రెడ్డి సామాజిక వర్గం నేతలు.. కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక ….ఇప్పటికే చాలా మంది సీనియర్స్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారిని సైతం .. పిలిచి మాట్లాడడం ద్వారా .. కాంగ్రెస్ లోకి రప్పించే అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయంలో షర్మిలకు రాహుల్ టీమ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు వైసీపీలో ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఆమె ఏ పార్టీలో చేరినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పలువురు వైసీపీ అగ్రనేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటిస్తున్నారు. నిజంగా ఇబ్బంది లేకుంటే.. ఆమె కాంగ్రెస్ లో చేరడంపై ప్రకటన చేయకుండా లైట్ తీసుకుని ఉంటే సరిపోతుంది కదా అని.. కాంగ్రెస్ నేతలు,షర్మిల అనుచరులు ప్రశ్నిస్తున్నారు.













