YSRCP: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ మారనుందా..?
ఆంధప్రదేశ్ లో రాజధాని అంశం రాజకీయ పార్టీలకు ఎంత కీలకంగా మారిందో తెలిసిన విషయమే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాజధాని (AP Capital) ప్రధానాంశంగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ (TDP) అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించింది. ల్యాండ్ పూలింగ్ (Land Pooling) ద్వారా 33వేలకు పైగా ఎకరాల భూములను సేకరించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అమరావతికి మద్దతు తెలిపింది. అయితే వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంది. అమరావతితో పాటు మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చింది.
జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును జ్యుడిషియల్ రాజధానిగా ప్రకటించింది. ఇలా అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తెలిపింది. అయితే వైసీపీ నిర్ణయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే వైసీపీ మాత్రం వెనక్కు తగ్గలేదు. అమరావతి అక్రమాలమయమని, అది కమ్మ రాజధాని అని ఎద్దేవా చేసింది. చంద్రబాబు (Chandrababu) సహా పలువురు నేతలపై కేసులు కూడా నమోదు చేసింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. మూడు రాజధానుల అంశంతో వైసీపీ, అమరావతి మాత్రమే రాజధాని అని కూటమి పార్టీలు అని ప్రచారం చేశాయి.
ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కూటమి ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు వ్యతిరేకించినట్లయింది. పైగా అమరావతిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జగన్ హయాంలో పూర్తిగా నిరాదరణకు గురైన అమరావతిని క్లీన్ చేసి పనులు ప్రారంభించింది. రెండేళ్లలో పూర్తి చేయాలనేది చంద్రబాబు సంకల్పం. అదే జరిగితే అమరావతిని మార్చడం ఇక అసాధ్యం.
అందుకే అమరావతి విషయంలో వైసీపీ పునరాలోచనలో పడ్డట్టు అర్థమవుతోంది. ఈ విషయంపై పార్టీలో చర్చించుకుంటామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రకటించారు. అప్పటి విధానం ప్రకారం మూడు రాజధానులు (3 Capitals) అని ప్రకటించామని, అయితే ఇప్పుడు దీనిపై పార్టీలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. మొదట్లో అమరావతిని రాజధానిగా ఒప్పుకుని తర్వాత ప్లేట్ ఫిరాయించడంతో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. దీంతో ఇప్పుడు కూడా మూడు రాజధానులను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం వస్తుందనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం.













