YCP Video: విజయసాయి రెడ్డి-టీడీ జనార్ధన్ రహస్య భేటీ? వీడియో రిలీజ్ చేసిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case) రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), తెలుగుదేశం పార్టీ (TDP) కీలక నేత టీడీ జనార్ధన్‌తో (TD Janardhan) రహస్యంగా సమావేశమైనట్లు వైసీపీ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. లిక్కర్ స్కాం కేసు టీడీపీ రాజకీయ కుట్ర అని, వైసీపీ నాయకులపై కక్ష సాధింపునకు నిదర్శనమని వైసీపీ ఆరోపిస్తోంది.
విజయసాయిరెడ్డి – టీడీ జనార్ధన్ రహస్యంగా సమావేశమయ్యారంటూ వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. మార్చి 11న విజయసాయి రెడ్డి విజయవాడలోని తాడేపల్లిలోని పార్క్ విల్లేలోని (Park Ville) 27వ నెంబర్ విల్లాలోకి సాయంత్రం 5:49కు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించారు. కొద్ది నిమిషాల తర్వాత టీడీపీ నాయకుడు టీడీ జనార్ధన్, అదే విల్లాలోకి ప్రవేశించినట్లు వీడియో చూపిస్తుంది. విజయసాయి రెడ్డి CID విచారణకు హాజరయ్యే ముందు ఈ భేటీ జరిగినట్లు ‘ది వైర్’ నివేదిక పేర్కొంది. ఈ వీడియో ఆధారంగా, వైసీపీ ఈ కేసు రాజకీయ కుట్ర అని, వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తోంది.
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఈ ఆరోపణలను బలపరిచారు. టీడీపీ ప్రభుత్వం “రెడ్ బుక్” వ్యూహంతో విపక్ష నాయకులు, అధికారులను బెదిరించి, అక్రమ అరెస్టులు చేస్తోందని విమర్శించారు. మరో నాయకుడు మార్గాని భరత్, మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిపై కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగమని పేర్కొన్నారు. అయితే టీడీపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. విజయసాయి రెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాగా, అతను తనను తాను “విజిల్‌బ్లోయర్”గా చెప్పుకుంటున్నారని టీడీపీ చెప్తోంది. రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం ఆధారంగా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదయ్యాయయని టీడీపీ పేర్కొంది.
అయితే ఈ వీడియోపై అటు విజయసాయి రెడ్డి కానీ, టీడీ జనార్ధన్ కానీ స్పందించలేదు. వాళ్లిద్దరూ దేనికోసం భేటీ అయ్యారో స్పష్టంగా తెలీదు. కేసు విచారణకు ముందు ఈ భేటీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ కనిపించడంతో.. ఇది కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. సహజంగా తనపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి వెంటనే స్పందిస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇంతవరకూ ఆయన రియాక్ట్ కాలేదు. ఎక్స్ లో కరోనాపై స్పందించారు కానీ వీడియో పైన స్పందించలేదు. ఒకవేళ ఆయన స్పందిస్తే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.